Corona Virus: గర్భస్థ శిశువుకు తల్లి ద్వారా కరోనా యాంటీబాడీలు... ఓ అధ్యయనంలో వెల్లడి!
- అమెరికాలో అధ్యయనం
- పెన్సిల్వేనియా ఆసుపత్రిలో గర్భవతులపై పరిశోధన
- 1,470కి పైగా రక్తనమూనాల పరిశీలన
- శిశువుల బొడ్డు తాడులో యాంటీబాడీలు
- 'మాయ' ద్వారా సరఫరా అయినట్టు గుర్తింపు
కరోనా వైరస్ భూతం ప్రతి ఒక్కరికీ సోకుతుందన్న సంగతి తెలిసిందే. గర్భిణీలకే కాదు, శిశువులకు కూడా వ్యాపిస్తుంది. అయితే, ప్రముఖ పీడియాట్రిక్స్ జర్నల్ జేఏఎంఏ ఓ అసక్తికర అధ్యయనం ప్రచురించింది. ఆ అధ్యయనం ఇటీవలే నిర్వహించారు. కరోనా బారిన పడిన గర్భవతి... తనలో తయారైన యాంటీబాడీలను శిశువుకు కూడా అందించగలదట. అందుకు ప్లెజెంటా (మాయ) సాయం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. 'మాయ' ద్వారా యాంటీబాడీలను గర్భంలోని బిడ్డకు బదిలీ చేస్తుందని తమ అధ్యయనంలో పేర్కొన్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియా ఆసుపత్రిలో 1,470 మందికి పైగా గర్భవతుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ పరిశోధన సాగించారు. బిడ్డలకు జన్మనిచ్చిన 83 మంది తల్లుల్లో యాంటీబాడీలను గుర్తించగా, 87 శాతం నవజాత శిశువుల బొడ్డు తాడులో యాంటీబాడీలను కనుగొన్నారు. అంటే తల్లి మాయ నుంచే వారికి యాంటీబాడీల సరఫరా జరిగినట్టు వెల్లడైంది.
తల్లి శరీరంలో ఏ స్థాయిలో యాంటీబాడీలు ఏర్పడ్డాయన్న అంశంపైనే శిశువుల శరీరంలో ఉండే యాంటీబాడీల శాతం ఆధారపడి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. గర్భవతుల కోసం ఎలాంటి కరోనా వ్యాక్సిన్ రూపొందించాలన్న దానిపై తమ అధ్యయనం తోడ్పాటు అందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.