Australia: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ టూర్ ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
- దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు టెస్టుల సిరీస్
- గత వారమే ఆటగాళ్లను ప్రకటించిన ఆస్ట్రేలియా
- ఆటగాళ్ల ఆరోగ్యమే తమకు ప్రధానమన్న ఆసీస్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికా టూర్ ను ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులను ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది. గత వారంలో తన జట్టును కూడా ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రబలడంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే నిర్ణయాన్ని ఆస్ట్రేలియా మార్చుకుంది.
దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లకపోవడంపై క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో తమ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు పయనించడం ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచించారని తెలిపింది. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిరీస్ రద్దు చేసుకున్నామని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిరీస్ ని పోస్ట్ పోన్ చేయడం మినహా తమకు మరో ఆప్షన్ లేదని తెలిపింది. దక్షిణాఫ్రికాతో ఆడేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని... పరిస్థితి చక్కబడిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పింది.