Venkaiah Naidu: తెలంగాణ యువ పర్వతారోహకుడు అంగోతు తుకారాంను అభినందించిన వెంకయ్యనాయుడు
- ఐదు ఖండాల్లోని పర్వతాలను అధిరోహించిన తుకారాం
- గిన్నిస్ బుక్ లో స్థానం
- వెంకయ్యనాయుడితో మర్యాదపూర్వక భేటీ
- అంతకుముందు రాష్ట్రపతిని కలిసిన తుకారాం
ఐదు ఖండాల్లోని ఎత్తయిన, క్లిష్టమైన పర్వతాలను అధిరోహించడం ద్వారా అంగోతు తుకారాం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణకు చెందిన తుకారాం ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన తుకారాం... పర్వతారోహణలకు సంబంధించిన పుస్తకాన్ని వెంకయ్యకు బహూకరించాడు. ఈ సందర్భంగా తుకారాంను ఆయన అభినందించారు. ఈ రంగంలో మరింత వృద్ధిని సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
అంగోతు తుకారాం ఇవాళ తొలుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత... తుకారాంను రాష్ట్రపతికి పరిచయం చేశారు. తుకారాం ఘనతల పట్ల అభినందించిన రాష్ట్రపతి... తన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని తెలిపారు.
తుకారాం స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం టెక్కలపల్లి తండా. అతి తక్కువ కాలంలోనే ఎవరెస్ట్ సహా ఐదు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. తుకారాం భవిష్యత్తులో అంటార్కిటికా, ఉత్తర అమెరికా ఖండాల్లోని పర్వతాలను అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నాడు.