Raghu Rama Krishna Raju: ఏపీకి రాజధాని ఏదో తెలియనప్పుడు మెట్రో రైలు ఎలా కేటాయిస్తారు?: రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishna Raju comments on latest situations

  • తాజా పరిణామాలపై రఘురామ స్పందన
  • ఎస్ఈసీ సజావుగా పనిచేస్తున్నారని వెల్లడి
  • స్పీకర్ నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమని వ్యాఖ్యలు
  • అచ్చెన్న అరెస్ట్, పట్టాభిపై దాడి ఘటనలపైనా స్పందించిన రఘురామ

కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్ లో ఏపీకి సంబంధించి మెట్రో రైలు ప్రసక్తే రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఏపీ రాజధాని ఏదో తెలియనప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

ఇక, పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ, స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే ఎస్ఈసీపై మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం, ఈ అంశంలో స్పీకర్ నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం అని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

అటు, అచ్చెన్నాయుడు అరెస్ట్ పైనా తన అభిప్రాయాలు వెల్లడించారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థితో అచ్చెన్న మాట్లాడిన తీరు మీడియా అంతటా ప్రసారమైందని, అందులో ఆయన బెదిరింపులకు పాల్పడింది ఎక్కడో తనకు అర్ధంకావడం లేదని అన్నారు.

"అందరం ఒక కుటుంబం వాళ్లం, కలిసి పనిచేసుకుందాం, ప్రభుత్వమే ఏకగ్రీవాలకు ప్రోత్సాహం అందిస్తున్నప్పుడు మనమే పోటీ చేసుకోవడం ఎందుకని చాలా సామరస్యపూర్వకంగా మాట్లాడారు. అచ్చెన్న ఎంతో సంయమనంతో మాట్లాడిన మాటలను మన పోలీసులు బెదిరింపుగా అర్థం చేసుకున్నారు. బెదిరింపుకు, అర్థింపుకు వారికి తేడా తెలిసినట్టు లేదు" అని వ్యాఖ్యానించారు.

విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడి తిరిగి టీడీపీ పైకి నెట్టే ప్రయత్నాలు జరగొచ్చని అన్నారు. ఆలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వారిపైనే ఆరోపణలు చేయడమే అందుకు నిదర్శనమని తెలిపారు.

  • Loading...

More Telugu News