COVAXIN: అమెరికాకు మన టీకా.. ఆక్యుజెన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం
- కొవాగ్జిన్‌కు అమెరికా క్లినికల్ పరీక్షలు
- తొలి దశ టీకాలు భారత్ నుంచే సరఫరా
- టీకా తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ
కరోనా కట్టడి కోసం దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా అమెరికా ప్రజలకూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆక్యూజెన్ అనే కంపెనీతో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ బయోటెక్ వెల్లడించింది.
ఒప్పందంలో భాగంగా కొవాగ్జిన్ టీకాకు ఆక్యుజెన్ సంస్థ అమెరికాలో క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందిన అనంతరం టీకాను విక్రయిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, తొలి దశ టీకాలను భారత్ బయోటెక్ ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంది. ఆ తర్వాత మాత్రం అక్కడే తయారుచేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ‌్ఞానాన్ని ఆక్యుజెన్‌కు బదిలీ చేస్తుంది.
ఇక అమెరికాలో కొవాగ్జిన్ టీకా విక్రయాల ద్వారా వచ్చిన లాభాల్లో 45 శాతం ఆక్యుజెన్ తీసుకోగా, మిగిలిన సొమ్ము భారత్ బయోటెక్‌కు లభిస్తుంది. అమెరికా నుంచి కొవిడ్‌ను తరిమికొట్టేందుకు కొవాగ్జిన్ మంచి పరిష్కారం అవుతుందని ఆక్యుజెన్ చైర్మన్ డాక్టర్ శంకర్ ముసునూరి తెలిపారు.