Deep Siddhu: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ ఎక్కడున్నాడో చెబితే రూ.1 లక్ష... పోలీసు రివార్డు!

One Lakh Reward Announced for Actor Deep Siddhu Where Abouts
  • గత వారంలో ఎర్రకోట వద్ద నిరసనలు
  • మరో నలుగురి ఆచూకీ చెబితే రూ. 50 వేల చొప్పున బహుమతి
  • ప్రకటన విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు
గణతంత్ర దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన రైతు నిరసనలకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ ఎక్కడ ఉన్నాడో చెబితే లక్ష రూపాయలు రివార్డుగా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. దీప్ సిద్ధూ ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇదే సమయంలో మరో నలుగురు రైతు ఉద్యమకారులు జగ్బీర్ సింగ్, బూటా సింగ్, సుఖ్ దేవ్, ఇక్బాల్ సింగ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 50 వేల చొప్పున రివార్డు ఇస్తామని పేర్కొన్నారు.  

కాగా, వీరు ఐదుగురే రైతుల ట్రాక్టర్ ర్యాలీని ఎర్రకోట వైపు ఉద్దేశపూర్వకంగా మళ్లించారని ఇప్పటికే కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీరి గురించిన సమాచారం గానీ, వారు ఎక్కడ ఉన్నారన్న విషయంగానీ తెలిస్తే, సమీపంలోని పోలీసు స్టేషన్ లో తెలియజేయాలని కోరారు.

ఇదిలావుండగా, తానేమీ రైతులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించలేదని, జరిగిన ఘటనల్లో తన ప్రమేయం లేదని, పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని ఇటీవల దీప్ సిద్ధూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెడ్ ఫోర్ట్ పై సిక్కుల జెండాను ఎగురవేస్తున్న సమయంలో అక్కడే ఉండి, ఫేస్ బుక్ మాధ్యమంగా లైవ్ ప్రారంభించిన దీప్ సిద్ధూ, నిరసనకారులను ఉత్తేజపరుస్తున్న వీడియో వైరల్ అయింది.

ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు ఆయనతో పాటు దాదాపు 200 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో చాలా మంది పోలీసుల విచారణకు హాజరై వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల కాగా, ప్రధాన నిందితులుగా పేర్కొన్న పలువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Deep Siddhu
Red Fort
Delhi Police
Reward
One Lakh

More Telugu News