Nimmagadda Ramesh Kumar: రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్!
- రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండకూడదని ఆదేశాలు
- ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల నేపథ్యంలో తనిఖీ
- ఎస్ఈసీ కార్యాలయానికి వాహనాలను తీసుకొచ్చిన అధికారులు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల నేపథ్యంలో రేషన్ డెలివరీ వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్ వాహనాల ద్వారా సరకుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు తెలపడంతో ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో నిబంధనల అమలు సక్రమంగా జరుగుతోందా? అన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దృష్టి పెట్టారు. ఈ రోజు రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేశారు. ఆయా వాహనాలను ఎస్ఈసీ పరిశీలించాలన్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి ఆ వాహనాలను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకురావడంతో నిమ్మగడ్డ స్వయంగా వాటిని తనిఖీ చేశారు. ఆయా వాహనాలపై ఉన్న రంగులతో పాటు ఫొటోలను పరిశీలించారు. రేషన్ డెలివరీ వాహనంలోని సదుపాయాల గురించి ఆయనకు అధికారులు వివరాలు తెలిపారు.