Tirumala: శ్రీనివాసుని పూజల కోసం... తిరుమలలో భారీ పుష్పవనాలు!
- స్వామి నిత్య కైంకర్యాల నిమిత్తం వనాలు
- అన్ని రకాల పుష్పాలనూ పెంచనున్న టీటీడీ
- గోగర్భం వద్ద శ్రీ గంధ పవిత్ర ఉద్యానవనం
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని నిత్య పూజలు, కైంకర్యాలకు అవసరమైన పుష్పాల కోసం ఐదు ఎకరాల స్థలంలో ఉద్యానవన శాఖ పుష్పవనాన్ని అభివృద్ధి చేసింది. ఇక్కడ చామంతి, వృక్షి, రోజా, మధురై మల్లెలతో పాటు కనకాంబరాలు, లిల్లీ పూలు, తులసి, పన్నీరు ఆకు, సంపంగి తదితర పుష్ప పంటలను వేశామని, వీటిని ఏప్రిల్, మే నెల నుంచి స్వామికి వినియోగిస్తామని అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో శిలా తోరణం వద్ద మరో 10 ఎకరాల్లో పవిత్ర ఉద్యానవనాన్ని నిర్మించామని అధికారులు తెలిపారు. ఇది పవిత్ర ఉద్యానవనమని, ఇక్కడ ఏడు ఆకులను కలిగివుండే అరటితో పాటు ఉసిరి, మోదుగ, జువ్వి, దర్భం, మామిడి, పారిజాతం, కదంబం, రావి అడవి మల్లి, పొగడ, ఎర్ర గన్నేరు, నాబి, మాధీఫలం, బొట్టుగు వంటి 25 రకాల మొక్కలను పెంచుతున్నట్టు పేర్కొన్నారు. దాతల సహకారంతో వీటిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
గోగర్భం జలాశయం వద్ద శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనం తయారవుతోందని, ఇక్కడ ఎర్రచందనంతో పాటు శ్రీగంధం చెట్లను పెంచాలని నిర్ణయించామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక తిరుమలకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు వినియోగిస్తున్న ఘాట్ రోడ్లతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లోనూ పూల మొక్కలను పెంచనున్నామని ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించడమే తమ ఉద్దేశమని అన్నారు.