India: వ్యాక్సిన్ పట్ల చాలామందిలో సంకోచం.. లక్ష్యాన్ని చేరలేకపోతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం!
- ఇండియాలో వ్యాక్సినేషన్ మొదలై 18 రోజులు
- ఇంకా లక్ష్యానికి సుదూరంగానే గణాంకాలు
- రోజురోజుకూ తగ్గుతున్న లబ్దిదారుల సంఖ్య
ఇండియాలో వ్యాక్సినేషన్ మొదలై 18 రోజులైంది. రోజువారీ టీకా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. గడచిన వారం రోజుల వ్యవధిలో రోజువారీ టీకాల సంఖ్య 5.7 లక్షల నుంచి 1.8 లక్షలకు పడిపోయింది. సరాసరి లబ్దిదారుల శాతం కూడా 57 నుంచి 49 శాతానికి తగ్గింది. జనవరి 28న ఒక్కో టీకా కేంద్రంలో లబ్దిదారుల సంఖ్య సగటున 56గా నమోదు కాగా, జనవరి 31న ఇది 57కు చేరింది. ఫిబ్రవరి 2న వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సగటు లబ్దిదారుల సంఖ్య 49కి పడిపోయింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం స్పందిస్తూ, శరవేగంగా టీకాను పంచుతున్న దేశంగా ఇండియా నిలిచిందని, మరే దేశంలోనూ లేనివిధంగా 18 రోజుల వ్యవధిలోనే 40 లక్షల మందికి టీకాలు వేశామని పేర్కొంది. ఇదే సమయంలో టీకా లక్ష్యానికి మాత్రం ఇండియా చాలా దూరంగా ఉందని ప్రజారోగ్య నిపుణులు వ్యాఖ్యానించారు.
"మనం లక్ష్యంగా పెట్టుకున్న 60 కోట్ల డోస్ లను 30 కోట్ల మందికి వచ్చే ఆరు నెలల్లో పంచాలంటే, రోజుకు 33 లక్షల మందికి టీకాలను ఇవ్వాల్సి వుంటుంది. మరిన్ని వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా తెరవాల్సిన అవసరం ఉంది. మరింత మంది వాలంటీర్లను నియమించుకోవాలి. ప్రభుత్వం తరఫున వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరలేమని భావిస్తే, ప్రైవేటు సెక్టారును అనుమతించాలి" అని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావలంకార్ అభిప్రాయపడ్డారు.
కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచాయి. గుజరాత్ లో 161 నుంచి 510కి, ఢిల్లీలో 81 నుంచి 183కు వ్యాక్సినేషన్ కేంద్రాలు పెరిగాయి. అయినా, ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ముందుండి, తొలుత వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది ప్రస్తుత వ్యాక్సిన్ల పట్ల సంకోచాన్ని వ్యక్తం చేస్తున్నారని, మరిన్ని మంచి వ్యాక్సిన్ల రాకకోసం ఎదురుచూస్తున్నారని ఉన్నతాధికారులు అంటున్నారు. టీకా లక్ష్యానికి సుదూరంగా ఉన్నామంటే, అదే కారణమని స్పష్టం చేశారు.