Gwadar Cricket Ground: ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రికెట్ స్టేడియం ఇదేనేమో...: ఐసీసీ ట్వీట్!
- బెలూచిస్థాన్ లో ఉన్న గ్వాదర్ గ్రౌండ్
- ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న స్టేడియం
- చిత్రాలను ట్వీట్ చేసిన ఐసీసీ
ప్రపంచంలో అత్యంత అందంగా ఉండే క్రికెట్ స్టేడియాలు ఏంటని ప్రశ్నిస్తే, పలు పేర్లు వినిపిస్తాయి. ఒక్కొక్కరు ఒక్కో స్టేడియం పేరు చెబుతారు. లార్డ్స్ మైదానమని, ఈడెన్ గార్డెన్స్ అని, హిమాలయ సానువుల్లో ఉండే ధర్మశాల అని, న్యూజిలాండ్ లోని మైదానాలని... ఇలా ఎన్నో సమాధానాలు వస్తుంటాయి. కానీ, తాజాగా ఐసీసీ ఓ ట్వీట్ చేస్తూ, వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రికెట్ గ్రౌండ్స్ అంటూ ఓ ట్వీట్ చేయగా అది వైరల్ అయింది.
ఇండియాకు పొరుగునే ఉన్న బెలూచిస్థాన్ లో గ్వాదర్ క్రికెట్ స్టేడియంను నిర్మిస్తున్నారు. తాజాగా దీని చిత్రాలను షేర్ చేసిన ఐసీసీ, ఈ గ్రౌండ్ కన్నా మరింత అందంగా కనిపించే చిత్రమేదైనా ఉంటే చూద్దామని వ్యాఖ్యానించింది. అంతే... ఈ ట్వీట్ దూసుకెళ్లింది. ఇదే అంతమైన మైదానమంటూ నెటిజన్లు అంటున్నారు.
ఇక దీనిపై స్పందించిన పాక్ దిగ్గజ క్రికెటర్ వసీమ్ అక్రమ్, వరల్డ్ బ్యూటిఫుల్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచి తీరుతుందని కితాబునిచ్చారు. ఒకవైపు ఎత్తయిన పర్వతం, మరోవైపు నగరం, ఇంకోవైపు ఖాళీ స్థలంతో ఉన్న గ్వాదర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, భవిష్యత్తులో మరింకెంత అందంగా మారుతుందో!