Nanda Kishore Gurjar: రూ.2 వేలు ఇస్తే చాలు రాకేష్ తికాయత్ ఎక్కడికైనా పోతాడు... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Rakesh Tikayat Goes for Anywhere for 2000 Says Accuses BJP Leader
  • రైతులకు నేతృత్వం వహిస్తున్న రాకేష్ తికాయత్
  • ఆయన రైతు కాదని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే నంద కిశోర్ గుర్జార్
  • రైతులను విభజిస్తున్నాడని విమర్శలు
రైతు సంఘం నేతగా చెప్పుకుని తిరుగుతున్న రాకేష్ తికాయత్, వాస్తవానికి రైతు మద్దతుదారేమీ కాదని, రూ. 2 వేలు ఇస్తే, ఎక్కడికైనా వెళ్లిపోయి, అక్కడ ఉన్న ఎవరినైనా రెచ్చగొట్టేలా మాట్లాడటం ఆయన ప్రత్యేకతని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ గుర్జార్ సంచలన ఆరోపణలు చేశారు. యూపీ - ఢిల్లీ సరిహద్దుల్లో మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ, నిరసనలు తెలుపుతున్న రైతులకు రాకేశ్ తికాయత్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అతను తనను తాను రైతు కన్నా అధికంగా భావిస్తున్నాడని, భారతీయ కిసాన్ యూనియన్ పేరిట, అతను డబ్బులు దండుకుంటాడని వ్యాఖ్యానించిన నంద కిశోర్ గుర్జార్, ఎవరు పిలిచి రెండు వేలిచ్చినా వెళ్లిపోతాడని తీవ్ర విమర్శలు చేశారు. "నేను ఓ రైతును. నాకన్నా పెద్ద రైతునని అతను అనుకుంటాడు. నాకున్న భూమిలో అతనికి సగం కూడా లేదు. తికాయత్ క్షమాపణలు చెప్పాల్సిందే. దేశంలోని రైతులను అతను విభజిస్తున్నాడు. చరిత్ర అతన్ని క్షమించదు" అని తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కిశోర్ గుర్జార్ అన్నారు.

రైతు నిరసనకారులు విధ్వంసానికి దిగడానికి అతనే కారణమని ఆరోపించిన గుర్జార్, ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్నది అసలు రైతుల నిరసనే కాదని అన్నారు. ఎవరు అక్కడికి వెళ్లి చూసినా, కేవలం రాజకీయ పార్టీలకు చెందిన నలుగురైదుగురే కనిపిస్తున్నారని, ఇది రైతుల నిరసనని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సరిహద్దుల్లో రాజకీయ నాయకులే అక్కడ కూర్చుని ఉన్నారని, సరిహద్దుల్లో రైతుల పేరిట ఉన్న వారు వ్యవసాయ కూలీలేనని అన్నారు.
Nanda Kishore Gurjar
Rakesh Tikayat
Farmers
Protests

More Telugu News