Greta Thun Berg: రైతు నిరసనలపై ట్వీట్ ఎఫెక్ట్... గ్రెటా థన్ బర్గ్ పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
- వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు
- ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు
- రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన థన్ బెర్గ్
- నేరపూరిత కుట్ర అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. భారత రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనల నేపథ్యంలో గ్రెటా థెన్ బర్గ్ వివాదాస్పద ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. థన్ బర్గ్ చేసిన ట్వీట్ పట్ల భారత్ లోని భిన్న వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతు నిరసనలపై అంతర్జాతీయ ప్రముఖులు చేస్తున్న ట్వీట్లపై భారత కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో వెనక్కి తగ్గిన ఈ స్వీడిష్ పర్యావరణ వేత్త తన ట్వీట్ ను తొలగించింది.
అయితే ఢిల్లీ పోలీసులు థన్ బర్గ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. థన్ బర్గ్ తన వ్యాఖ్యల ద్వారా నేరపూరితమైన కుట్రకు తెరదీశారని, ఆమె వ్యాఖ్యలు ప్రజా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా, తనపై కేసు నమోదైన నేపథ్యలో థన్ బర్గ్ స్పందిస్తూ, తాను ఇప్పటికీ రైతుల పక్షమేనని స్పష్టం చేసింది. ఎలాంటి బెదిరింపులు తన వైఖరిని మార్చలేవని స్పష్టం చేసింది. రైతుల శాంతియుత ధర్నాలకు తానిప్పటికీ మద్దతు ప్రకటిస్తున్నానని ట్వీట్ చేసింది.
కాగా, తమ ఎఫ్ఐఆర్ లో థన్ బర్గ్ ను నిందితురాలిగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా పక్షపాత చర్యలకు పాల్పడడం.. మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష వంటి అంశాల నేపథ్యంలో విభిన్న సమూహాల మధ్య విద్వేషాలు రగల్చడం వంటి కారణాలను ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినట్టు వెల్లడించారు.