Wedding: ఇది ఆధార్ కార్డు కాదు... పెళ్లి విందు మెనూ కార్డు!
- ఫిబ్రవరి 1న పెళ్లి చేసుకున్న గోగోల్, సువర్ణ
- కోల్ కతాలో పెళ్లి
- ఆధార్ కార్డు తరహాలో మెనూ డిజైన్
- పెళ్లిలో ఇదే హైలైట్
- డిజిటల్ ఇండియా ప్రచారం కోసమేనన్న వరుడు
తమ పెళ్లి చిరకాలం గుర్తుండిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం వివాహం కాబట్టి శక్తిమేర ఘనంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. కొందరు తమ పెళ్లి విభిన్నంగా ఉండాలని అనుకుంటారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ జంట కూడా ఈ కోవలోకే వస్తుంది.
కోల్ కతా రాజర్ హాట్ ఏరియాకు చెందిన గోగోల్ సాహా, సువర్ణ దాస్ ల పెళ్లి ఫిబ్రవరి 1న జరిగింది. వీరి పెళ్లి విందుకు ఏర్పాటు చేసిన మెనూ కార్డును చూడగానే ఆధార్ కార్డు అని భావిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, ఆ మెనూ కార్డును అచ్చం ఆధార్ కార్డు తరహాలోనే రూపొందించారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేరకు డిజిటల్ ఇండియా కార్యాచరణను ఎంతగానో ఇష్టపడే వధూవరులు గోగోల్, సువర్ణ తమ పెళ్లిలో ఆధార్ ను పోలిన మెనూ కార్డు డిజైన్ చేయించారు.
ప్రతి డైనింగ్ టేబుల్ వద్ద ఈ మెనూ కార్డులను చూసి ఆధార్ కార్డులని భ్రమించడం పెళ్లికి విచ్చేసిన అతిథుల వంతైంది. దీనిపై పెళ్లికొడుకు గోగోల్ మాట్లాడుతూ, ఈ ఆలోచన తన భార్య సువర్ణదేనని తెలిపాడు. డిజిటల్ ఇండియాపై ప్రజల్లో అవగాహన కలిగించడం కోసమే మెనూ కార్డులను ఆధార్ తరహాలో తయారు చేయించామని చెప్పాడు. పెళ్లికి వచ్చిన వారందరూ దీని గురించి మాట్లాడుకున్నారని, దాంతో తమ ఉద్దేశం నెరవేరిందని భావిస్తున్నామని పేర్కొన్నాడు.