India: ప్రజాస్వామ్య సూచీలో తగ్గిన భారత్ ర్యాంక్!
- 2019లో 51వ స్థానంలో ఇండియా
- 6.9 నుంచి 6.61కి పడిపోయిన స్కోరు
- తొలి స్థానంలో నార్వే, ఆపై ఐస్ ల్యాండ్, స్వీడన్
- చిట్ట చివరి స్థానంలో ఉత్తర కొరియా
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా ప్రకటించిన ప్రజాస్వామ్య సూచీలో భారత ర్యాంకు మరింతగా దిగజారింది. 2020 సంవత్సరానికి గాను డెమోక్రసీ ఇండెక్స్, గ్లోబల్ ర్యాంకింగ్ లను ఈఐయూ వెల్లడించగా, భారత్ స్థానం 51 నుంచి 53కు తగ్గింది. ఇదే సమయంలో ఇరుగు పొరుగున ఉన్న దేశాలతో పోలిస్తే మాత్రం ఇండియా మెరుగైన స్థానంలో ఉంది. ప్రజాస్వామ్య సూచీలో 2019లో 6.9 స్కోరుతో ఉన్న ఇండియా, 2020లో 6.61 పాయింట్ల స్కోర్ కు పడిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లో ప్రజాస్వామ్యపు విలువలు పరిశీలించి ఈ ర్యాంకులు ఇచ్చామని ఈఐయూ తెలిపింది.
కాగా, 2014తో పోలిస్తే, ప్రజాస్వామ్య పరిరక్షణ పరంగా భారత స్కోరు తగ్గుతూ వస్తుండటం గమనార్హం. 2014లో 7.92 పాయింట్ల స్కోరుతో ప్రపంచంలోనే 27వ స్థానంలో ఉన్న ఇండియా ర్యాంకు క్రమంగా పడిపోయింది. ఇక ఈ జాబితాలో నార్వే తొలి స్థానంలో నిలువగా, ఐస్ ల్యాండ్, స్వీడన్, న్యూజిలాండ్, కెనడాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
23 దేశాలలో పూర్తి ప్రజాస్వామ్యం ఉందని, 52 దేశాల్లో దోషపూరిత ప్రజాస్వామ్యం కొనసాగుతోందని ఈ సందర్భంగా ఈఐయూ పేర్కొంది. ఇండియాతో పాటు యూఎస్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం వంటి దేశాలు దోషపూరిత ప్రజాస్వామ్య జాబితాలో ఉన్నాయి. ఇండియాతో పాటు థాయ్ లాండ్ వంటి దేశాల్లో ప్రభుత్వ వర్గాలు ప్రజాస్వామ్యాన్ని లాగేసుకుంటున్నాయని, పౌరుల స్వతంత్రత తగ్గిపోతున్నదని ఈ సందర్భంగా ఈఐయూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇక ఇండియాలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, భారతీయ పౌరసత్వం విషయంలో మతపరమైన అంశాలు తెరపైకి వచ్చాయని, ఇది లౌకిక ప్రాతిపదికను బలహీనపరిచేదిగా ఉందని చాలా మంది నుంచి విమర్శలు వచ్చాయని పేర్కొంది. ఇదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు సైతం పౌరుల స్వతంత్రతను తగ్గించిందని ఈ నివేదిక వెల్లడించింది.
ఇండియాకు పొరుగున ఉన్న శ్రీలంక ఈ జాబితాలో 68వ ర్యాంకును సాధించగా, బంగ్లాదేశ్ 76, భూటాన్ 84, పాకిస్థాన్ 105వ స్థానాల్లో నిలిచాయి. ఆపై ఆఫ్గనిస్థాన్ 139వ స్థానంలో నిలిచింది. మొత్తం 167 దేశాల పేర్లతో జాబితా విడుదల కాగా, చిట్ట చివరి స్థానంలో నార్త్ కొరియా నిలిచింది.