Nara Lokesh: వైకాపా గ్యాంగ్ దృష్టి ఇప్పుడు మహనీయుల విగ్రహాల ధ్వంసంపై పడింది: నారా లోకేశ్
- ముందు దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్
- రామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు
- విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
'మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జగన్. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయాడు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడింది. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
'తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ని కఠినంగా శిక్షించాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
దీనిపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా విమర్శలు గుప్పించారు. 'తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో జరిగిన ఘటన ఇది. స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని రాజకీయ కక్షతో దుష్టశక్తులు నాశనం చేయడం దుర్మార్గపు చర్య. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన నాటి నుండి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి' గోరంట్ల బుచ్చయ్య విమర్శించారు.
'మూర్ఖత్వం పరాకాష్ఠకు చేరుకుంటే ఇటువంటి చర్యలు కి దారి తీస్తాయి. మీరు విగ్రహాన్ని ధ్వంసం చేస్తేనో.. లేక దాడులు చేస్తేనో తెలుగుదేశం పార్టీని బలహీన పరచలేరు. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధికార ఒత్తిళ్లు కి తలోగ్గకుండా వ్యవహరించాలి' అని గోరంట్ల బుచ్చయ్య డిమాండ్ చేశారు.