RBI: రెపో, రివర్స్​ రెపోల్లో ఈసారీ మార్పులు లేవు: ద్రవ్య విధానాలపై ఆర్బీఐ కీలక ప్రకటనలు

RBI keeps policy repo rate unchanged says GDP forecast at 10 percent
  • పాత రేట్లనే కొనసాగిస్తూ నిర్ణయం
  • జీడీపీ వృద్ధి అంచనా 10.5 శాతం
  • ద్రవ్యోల్బణం 5.2% ఉంటుందని అంచనా
  • రెండు దశల్లో సీఆర్ఆర్ పునరుద్ధరణ
  • మార్చి 27న 3.5%.. మే 22న 4% చేస్తామని ప్రకటన 
దేశ ఆర్థిక వృద్ధి ఇకపై పైపైకే వెళుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలు కావడంతో మళ్లీ ఆర్థిక రంగం పునరుత్తేజం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఫార్మా పరిశ్రమకు మరింత లబ్ధి చేకూరుతుందని ప్రకటించింది.

కేంద్ర బడ్జెట్ తర్వాత ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయించిన ద్రవ్య విధానాలపై శుక్రవారం పలు కీలక ప్రకటనలు చేసింది. ఆ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో, రివర్స్ రెపో రేట్లలో వరుసగా మూడోసారి ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్టు చెప్పారు.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. మొదటి అర్ధభాగంలో వృద్ధి 26.2 శాతం నుంచి 8.3 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేశారు. మూడో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చన్నారు. గతంతో పోలిస్తే ఉత్పత్తి రంగం పుంజుకుందని, మొదటి త్రైమాసికంలో 47.3 శాతం ఉత్పత్తితో పోలిస్తే రెండో త్రైమాసికంలో 63.3 శాతానికి పెరిగిందని చెప్పారు.

ఇటీవలి కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ), విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు (ఎఫ్ పీఐ)లు పెరిగాయన్నారు. మున్ముందు అది మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి అర్ధ భాగంలో నిత్యావసరాల ద్రవ్యోల్బణం (నిత్యావసరాల ధరల సూచీ– సీపీఐ) 5 నుంచి 5.2 శాతంగా ఉంటుందని  చెప్పారు. అంతకుముందు 4.6 నుంచి 5.2 శాతం మధ్య అంచనా వేశారు. కూరగాయల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుందన్నారు.

బ్యాంకులకు నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్ఆర్)ని రెండు దశల్లో స్థిరీకరిస్తామని ఆయన చెప్పారు. మార్చి 27న 3.5 శాతం, మే 22 నుంచి 4 శాతం చొప్పున పునరుద్ధరిస్తామని వివరించారు. దీని వల్ల వివిధ రకాల మార్కెట్ కార్యకలాపాలకు వీలు దొరుకుతుందని చెప్పారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్ బీఎఫ్ సీ)లకూ ఊరటనిచ్చే విషయం చెప్పారు. లక్షిత దీర్ఘకాలిక రెపో కార్యకలాపాల కోసం బ్యాంకుల నుంచి నిధులు తీసుకునే అవకాశం కల్పించారు.

రిటెయిల్ పెట్టుబడిదారులు ఆర్బీఐతో జిల్ట్ (ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను కలిగి ఉండడం) ఖాతాలు తెరవొచ్చని చెప్పారు. ఇప్పటిదాకా వారు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను నేరుగా కలిగి ఉండేందుకు అవకాశం లేదు. ప్రవాస భారతీయుల కోసం ఇక్కడి వారు ఐఎఫ్ఎస్సీ ద్వారా నిధులు జమచేయొచ్చని చెప్పారు.
RBI
Shaktikantha Das
Repo
Reverse Repo
NBFC
Inflation
GDP

More Telugu News