Maharashtra: స్వీటు కోసం ఏడ్చిందని.. 20 నెలల పసిపాపను మెట్లకేసి కొట్టి చంపిన కర్కశ తండ్రి
- ఏడుపు ఆపేందుకు రూ.5 ఇవ్వాలని అడిగిన భార్య
- కోపంతో చిన్నారి తలను తలుపులకు బాదిన నిందితుడు
- అడ్డు వచ్చిన భార్యపైనా కిరాతకంగా దాడి
- ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఊపిరి వదిలిన చిన్నారి
- మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘటన
పసిదానికి స్వీటు కొనివ్వాలని భర్తను భార్య 5 రూపాయలు అడిగింది. దానికి అతడు లేవన్నాడు. పాప ఏడుపు ఆగలేదు. కోపంతో ఊగిపోయిన అతడు.. అత్యంత కర్కశంగా కన్న బిడ్డను మెట్లకేసి కొట్టి చంపాడు. ఆ చిన్నారి తలను తలుపులకేసి బాదాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు తీవ్రగాయాలపాలైన ఆ 20 నెలల చిన్నారి ఊపిరి ఆగి పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని లూనారాలో జరిగింది. ఆ కర్కశుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కటకటాల వెనక్కు నెట్టారు.
తన భర్త వివేక్ ఊయికే (28) ఇంటికి వచ్చేటప్పటికి బిడ్డ వైష్ణవి ఏడుస్తోందని, ఖాజా కొనివ్వడానికి రూ.5లు తన భర్తను అడిగానని వర్ష చెప్పింది. తన వద్ద చిల్లర లేవని వివేక్ చెప్పాడంది. ఏడుపు ఆపకపోవడంతో వైష్ణవిని తలుపులకేసి బాదాడని రోదించింది. అంతటితో ఆగకుండా ఇంటి మెట్లపైకి విసిరికొట్టాడని విలపించింది. ఆపాలని ప్రయత్నించిన తననూ చితకబాదాడని, తీవ్రగాయాలైనా కూడా బిడ్డను బతికించుకోవడానికి ఎలాగోలా తిరోడా సబ్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లానని తెలిపింది. అయితే, అప్పటికే పాప చనిపోయిందంటూ వైద్యులు చెప్పారని కన్నీటి పర్యంతమైంది.
వెంటనే ఆమె తిరోదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు వివేక్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కాగా, పెళ్లి అయిన కొన్ని రోజులకే వివేక్ తాగి వచ్చి వర్షను హింసించేవాడని, ఆ వేధింపులు తాళలేక కన్ని రోజులు పుట్టింటికి వెళ్లిందని పోలీసులు చెప్పారు. అయితే, పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ 2019లో మెట్టినింటికి వెళ్లిందని అన్నారు.