Corona Virus: జ్వరంతో మొదలై డయేరియా వరకు... కరోనా లక్షణాల వరుసక్రమం ఇదిగో!
- ఫ్లూ తరహా లక్షణాలు కలిగించే కరోనా
- జ్వరంతో కరోనా ప్రభావం మొదలు
- పొడిదగ్గు, తలనొప్పితోనూ సమస్యలు
- చివరగా డయేరియా
- కరోనా తీవ్రతకు డయేరియా సంకేతమంటున్న అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. సాధారణ జలుబే అని కొట్టిపారేయలేని రీతిలో ప్రమాదకరంగా విజృంభించిన ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కరోనా వస్తే జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయని తెలిసిందే. అయితే, కరోనా సోకగానే వరుసగా ఒకదాని వెంట ఒకటి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయన్న దానిపై పరిశోధకులు మరింత స్పష్టత ఇచ్చారు.
తమ అధ్యయనం ద్వారా ఇతర ఫ్లూ తరహా లక్షణాలకు, కరోనా వైరస్ కారక లక్షణాలకు తేడా తెలుసుకోవడం వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్ లోని ఏ రకం సోకినా మొదట వచ్చేది జ్వరమేనని వెల్లడించారు. 2020లో నమోదైన కరోనా కేసుల్లో 76 శాతం కేసుల్లో తొలిగా జ్వరం వచ్చినట్టు గుర్తించారు. ఇప్పుడు కరోనా కొత్త స్ట్రెయిన్ల వల్ల కలిగే లక్షణాల్లోనూ మొదటగా జ్వరమే వస్తోందని తేలింది. జ్వరం తర్వాత పొడిదగ్గు, జలుబు అధికంగా కనిపిస్తాయట. ఆపై వాసన చూసే శక్తి కోల్పోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలతో బాధపడతారని పరిశోధకులు తెలిపారు.
వీటి తర్వాత గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు ఏర్పడతాయని వివరించారు. కరోనా వైరస్ పేగులపైనా ప్రభావం చూపిస్తుందని, అందుకే కరోనా సోకిన వ్యక్తుల్లో చివరగా డయేరియా (అతిసార వ్యాధి), వికారం, ఉదర కండరాలు బిగదీసినట్టు కావడం వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు. కరోనా వైరస్ ప్రభావం ఓ వ్యక్తిపై తీవ్రస్థాయిలో ఉందనడానికి డయేరియా, ఉదర సంబంధ సమస్యలను బట్టి గుర్తించవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇవేకాకుండా మగత, అయోమయం, భ్రాంతులకు గురికావడం, చర్మ సంబంధ అలర్జీలు కూడా కొన్ని కేసుల్లో కనిపిస్తాయట.