Somu Veerraju: 'బీసీ ముఖ్యమంత్రి' వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు
- బీసీని సీఎం చేస్తామని నిన్న వ్యాఖ్యానించిన సోము
- తాను అలా అనలేదని తాజాగా వెల్లడి
- సీఎంను నిర్ణయించే అధికారం తనకు లేదని స్పష్టీకరణ
- అది హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యలు
తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని, ఓ బీసీని సీఎంగా చేసే దమ్ము వైసీపీ, టీడీపీలకు ఉందా అంటూ నిన్న సవాల్ విసిరిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అంతలోనే మాట మార్చారు.
బీసీని సీఎంగా చేస్తానని తాను అనలేదని, అసలు, రాష్ట్రానికి సీఎంను నిర్ణయించే అధికారం తనకు లేదన్నారు. అది బీజేపీ హైకమాండ్ పరిధిలోని విషయం అని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై నిర్ణయం తీసుకుంటారని మరింత వివరణ ఇచ్చారు. జాతీయస్థాయిలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీనే అని చెప్పాలన్నది తన ప్రయత్నమని తెలిపారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావిస్తున్న జనసేనకు సోము వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. సోము, పవన్ ఇద్దరూ కాపు వర్గానికి చెందినవారే కావడంతో సీఎం పదవిపై వ్యాఖ్యలు గందరగోళానికి, అసంతృప్తికి దారితీశాయి.