Kadapa District: టాస్ వేసి సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక చేసిన గ్రామస్థులు!
- కడప జిల్లా వరికుంటలో టాస్
- తొలి రెండేళ్ల కాలాన్ని ఎంచుకున్న గెలిచిన అభ్యర్థి
- ఎన్నికలు జరుగుతాయన్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం కొన్ని చోట్ల వేలంపాటలు జరుగుతుంటే, మరికొన్ని చోట్ల గ్రామ పెద్దలందరూ కలిసి అభ్యర్థులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్త మాత్రం వాటికి భిన్నం. కడప జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఏకంగా టాస్ వేశారు.
జిల్లాలోని సోమశిల ముంపు ప్రభావిత మండలమైన అట్లూరులోని వరికుంట పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక నాయకులు బొమ్మాబొరుసు వేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో గెలిచినవారు తొలుత రెండేళ్లు కానీ, చివరి మూడేళ్లు కానీ పదవిలో ఉండేందుకు అంగీకరించారు. దీంతో టాస్ వేయగా, గెలిచిన అభ్యర్థి తొలి రెండేళ్ల పదవీ కాలాన్ని ఎంచుకున్నాడు. అయితే, ఇక్కడ పోలింగ్ మాత్రం యథావిధిగానే జరుగుతుందని అధికారులు చెప్పడం గమనార్హం.