New Delhi: నేడు దేశవ్యాప్తంగా రైతుల రాస్తా రోకో.. మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధం
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా 72 రోజులుగా రైతుల ఆందోళన
- ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా రాస్తారోకో
- మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు ముగియనున్న నిరసన
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో దాదాపు 72 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు దేశవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్లను దిగ్బంధించనున్నారు. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమం జరుగుతుందని రైతు సంఘాలు తెలిపాయి. రాస్తారోకో సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు మంచినీళ్లు, స్నాక్స్ అందించాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ కోరారు.
మరోవైపు, తాము జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలను మాత్రమే దిగ్బంధిస్తామని, స్కూలు బస్సులు, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలను అడ్డుకోబోమని 41 యూనియన్ల రైతు సమైక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. మూడు గంటలకు రాస్తారోకో ముగిసే సమయంలో వాహనాల హారన్లను ఓసారి మోగించాలని సూచించింది.