Peddireddi Ramachandra Reddy: పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయండి: డీజీపీని ఆదేశించిన ఎస్ఈసీ
- ఎస్ఈసీ మాటలు వినొద్దంటూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
- అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామంటూ బెదిరింపులు
- పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎస్ఈసీ
- డీజీపీకి ఎన్నికల సంఘం లేఖ
- మంత్రిని ఇంటి నుంచి బయటికి అనుమతించవద్దని ఆదేశాలు
ఎస్ఈసీ చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకుంటే మీ ఇష్టం... మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతాం అంటూ జిల్లా అధికారులను హెచ్చరించిన ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.
పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించింది. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని బయటికి అనుమతించవద్దని, మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ప్రజలు నిర్భయంగా ఓటేయడానికి, ఎన్నికలు నిజాయతీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం వివరించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది.
మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యల తాలూకు పత్రికా కథనాల క్లిప్పింగులను కూడా తమ ఉత్తర్వులకు జత చేశారు.