Dilip Kumar: పాకిస్థాన్ లో నటుడు దిలీప్ కుమార్ పూర్వీకుల ఇంటిని అమ్మేందుకు నిరాకరిస్తున్న ప్రస్తుత యజమాని
- పెషావర్ లో ఇప్పటికీ ఉన్న దిలీప్ కుమార్ పూర్వీకుల ఇల్లు
- మ్యూజియంగా మార్చాలనుకుంటున్న పాక్ సర్కారు
- రూ.80.56 లక్షలు చెల్లించేందుకు సంసిద్ధత
- రూ.25 కోట్లు డిమాండ్ చేస్తున్న ప్రస్తుత యజమాని
బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ పూర్వీకులు పాకిస్థాన్ కు చెందినవారన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లోని పెషావర్ నగరంలో దిలీప్ కుమార్ పూర్వీకుల నివాసం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఆ ఇంటిని తమ వారసత్వ సంపదగా భావిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం అందులో మ్యూజియం ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
అయితే ఆ ఇంటి ప్రస్తుత యజమాని హాజీ లాల్ మహమ్మద్ అందుకు ససేమిరా అంటున్నాడు. ఆ ఇంటిని అమ్మేందుకు అంగీకరించడంలేదు. ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ధర తనకు లాభదాయకం కాదన్నది అతని వాదన. రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇంటిని తక్కువ ధరకు అమ్మలేనని, ప్రభుత్వం రూ.25 కోట్లు ఇస్తే ఇంటిని అమ్మేందుకు తాను సిద్ధం అని వెల్లడించాడు.
ఆ స్థలం విస్తీర్ణం 101 చదరపు మీటర్లు కాగా, రూ.80.56 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇది తనకు ఏమాత్రం గిట్టుబాటు కాదని హాజీ లాల్ మహమ్మద్ అంటున్నాడు. దిలీప్ కుమార్ పూర్వీకుల నివాసాన్ని తాను 2005లో రూ.51 లక్షలకు కొనుగోలు చేశానని వెల్లడించాడు. ఈ ప్రాంతంలో 25 చదరపు మీటర్ల ధర రూ.5 కోట్ల వరకు ఉంటుందని, ఆ లెక్కనే తనకు చెల్లించాలని కోరుతున్నాడు. మరి ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
బాలీవుడ్ లో విశేష ఖ్యాతి పొందిన దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. ఆయన పాకిస్థాన్ లోని పెషావర్ నగరంలో ఖిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలో 1922లో జన్మించారు.