Narendra Modi: రెండు వారాల వ్యవధిలో రెండోసారి బెంగాల్ కు మోదీ... ఈ దఫా మమత గైర్హాజరు!
- హల్దియా జిల్లాలో పర్యటించనున్న మోదీ
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- హాజరు కాబోని మమతా బెనర్జీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు వారాల వ్యవధిలో రెండోసారి పశ్చిమ బెంగాల్ లో పర్యటించనుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం మోదీని కలిసేందుకు సుముఖంగా లేరని సమాచారం. రాష్ట్రంలో తలపెట్టిన వివిధ మౌలిక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసే నిమిత్తం మోదీ నేడు హల్దియా జిల్లాలో పర్యటించనున్నారు. అయితే, గత నెల 23న సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన సభలో మోదీ సమక్షంలోనే తనకు అవమానం జరిగిందని బహిరంగంగానే ఆరోపించిన మమతా బెనర్జీ, ఈ దఫా మోదీ పర్యటనలో పాల్గొనబోరని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
రెండు వారాల క్రితం జరిగిన ఓ సభలో మమతా బెనర్జీ మాట్లాడుతున్న వేళ, కొందరు బీజేపీ మద్దతుదారులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మమతా బెనర్జీ మాట్లాడేందుకు నిరాకరిస్తూ, బహిరంగంగానే అసంతృప్తిని వెలిబుచ్చారు. ఇక ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ నేతలు తరచూ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తూ, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులు తమ రాష్ట్రంలో పర్యటిస్తూ, రాజకీయాలు చేస్తున్నారని, తమ ఎమ్మెల్యేలను, నేతలనూ వారి పార్టీలోకి తీసుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న జగదీప్ ధంకార్ కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఆయన బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నరేంద్ర మోదీ పాల్గొంటున్న కార్యక్రమాల్లో మమత పాల్గొనరాదని నిర్ణయించినట్టు తెలుస్తోంది.