Audimulapu Suresh: విద్యార్థిని తేజశ్రీ మృతి పట్ల జగన్ ఆవేదన చెందారు.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు: మంత్రి సురేశ్
- ఫీజు కట్టలేకపోవడం వల్లే ఆత్మహత్య?
- ఆమె మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది
- కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ చదువుతున్న విద్యార్థిని తేజశ్రీ ఇటీవల కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థిని మృతి పట్ల సీఎం జగన్ ఆవేదన చెందారని చెప్పారు. ఆమె మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. తేజశ్రీ మృతిపై తాము విచారణ కమిటీ వేశామని ప్రకటించారు.
ఈ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని వివరించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్యం అధిక ఫీజుల కోసం వేధించటం వల్లే తేజశ్రీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.