Pakistan: చైనా మిలటరీ నుంచి వ్యాక్సిన్ అందుకున్న తొలి విదేశీ ఆర్మీగా పాక్ సైన్యం
- పాక్ సైన్యానికి టీకా అందించిన చైనా
- ఇప్పటికే పాకిస్థాన్‌కు 5 లక్షల వ్యాక్సిన్ డోసులు
- కాంబోడియా మిలటరీకి అందించిన చైనా పీఎల్ఏ
తమ మిత్రదేశమైన పాకిస్థాన్ సైన్యానికి చైనా కరోనా వ్యాక్సిన్ అందించింది. పాక్ మిలటరీకి కరోనా టీకా అందించినట్టు చైనా రక్షణ శాఖ తెలిపింది. అయితే, ఎన్ని డోసులు అందించిందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. చైనా తాను అభివృద్ధి చేసిన సైనోఫార్మాకు చెందిన టీకా 5 లక్షల డోసులను ఇది వరకే పాకిస్థాన్‌కు అందజేసింది. ఇప్పుడు ఆ దేశ మిలటరీకి కూడా వ్యాక్సిన్ అందించింది.
చైనా మిలటరీ నుంచి కొవిడ్-19 వ్యాక్సిన్ అందుకున్న తొలి విదేశీ ఆర్మీగా పాక్ సైన్యం నిలిచిందని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పేర్కొంది. కాగా, కాంబోడియా నుంచి వచ్చిన అభ్యర్థనతో ఆ దేశ సైన్యానికి కూడా చైనా కొవిడ్ టీకాలను అందించింది. కాగా, పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 5,54,474 కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా మరణించిన 53 మందితో కలుపుకుని దేశంలో మరణించిన వారి సంఖ్య 11,967కు చేరుకున్నట్టు ఆ దేశ జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.