Mamata Banerjee: బెంగాల్ ను సర్వనాశనం చేస్తున్న మమతా బెనర్జీ: నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు
- ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మోదీ
- మమత పాలనలో అభివృద్ధి పూజ్యం
- ప్రజలు మమతకు శుభం కార్డు వేయాల్సిందే
- వామపక్షాలు మళ్లీ బలం పుంజుకున్నాయన్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హల్దియాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మమతా బెనర్జీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఆమె పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను బెంగాల్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బెంగాల్ వాసులు మమతా బెనర్జీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని, ఆమె పాలనకు అంతిమ ఘట్టం పడాలని, ఈ సంవత్సరం ఎన్నికల్లో బెంగాల్ వాసులంతా బీజేపీకి అండగా నిలవాలని కోరారు.
కేంద్ర బడ్జెట్ లో బెంగాల్ కు అన్ని విధాలుగా న్యాయం చేశామని నరేంద్ర మోదీ వెల్లడించారు. మమత పాలనపై రాష్ట్ర ప్రజలు చాలా నిరాశగా ఉన్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. కేంద్ర పథకాలను ఆమె ప్రజలకు దగ్గర చేయడం లేదని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో పాలకుల దుర్మార్గం, హింస, అవినీతి పెరిగిపోయాయని మోదీ విమర్శించారు. 'భారత్ మాతాకీ జై' అని నినదించినా, హక్కుల గురించి అడిగినా, తీవ్ర అసహనానికి గురయ్యే వారు ప్రజలకు సుపరిపాలనను ఎలా అందించగలరని ప్రశ్నించారు.
మమతా బెనర్జీ నేతృత్వంలో వామపక్షాలు మళ్లీ బలం పుంజుకున్నాయని ఆరోపించారు. ఈ సిండికేట్ బ్యాచ్ మరికొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత రాష్ట్రంలో కచ్చితంగా మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. నందిగ్రామ్ వేదికగా నానా హంగామా సృష్టించిన వారిని ముఖ్యమంత్రి మమత ఎందుకు తన పార్టీలోకి తీసుకున్నారో ప్రజలు అడగాలని అన్నారు. రాష్ట్ర పరిస్థితి ఇంతగా దిగజారిందంటే అది మమతా బెనర్జీ రాజకీయమేనని ఆరోపించారు.