Telangana: రాథోడ్ రమేశ్, ఇంద్రకరణ్ రెడ్డి సహా పార్టీలోకి ఎవరు వచ్చినా అభ్యంతరం లేదు: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు
- రాథోడ్ రమేశ్ వస్తానన్నా చేర్చుకోబోమని గతంలో చెప్పిన సోయం
- ఇప్పుడు ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్న ఎంపీ
- బడ్జెట్ కేటాయింపులపై విమర్శలను కొట్టిపారేసిన వైనం
తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, ఎమ్మెల్యే జోగు రామన్న సహా పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. రాథోడ్ రమేశ్ పార్టీలోకి వస్తానన్నా చేర్చుకోబోమంటూ గతంలో చెప్పిన సోయం ఇప్పుడు వెల్కమ్ చెప్పడం ఆసక్తిని రేపుతోంది.
ఆదిలాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్న టీఆర్ఎస్ నేతల విమర్శలపై ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాకు పిట్‌లైన్ మంజూరైందని, ఫలితంగా 48 రైళ్లు జిల్లా మీదుగా రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు.
ఆర్మూరు రైలు మార్గం కోసం మూడేళ్ల క్రితమే సగం నిధులు కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకుపలుకు లేకపోవడం వల్లే ఆ మార్గానికి కేంద్రం నిధులు కేటాయించలేదన్నారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి మిగతా సగం నిధులు కేటాయించేలా చేయగలిగితే, ఆ మరుసటి రోజే తాను కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తానని సోయం హామీ ఇచ్చారు.