Tamil Nadu: క్షమించడం అన్నా, కూటమి అన్నా చెడ్డ చిరాకు: డీఎండీకే నేత ప్రేమలత
- విజయకాంత్‌తో అభిప్రాయ భేదాలు లేవు
- ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
- కెప్టెన్ విజయ్‌కాంత్ ముఖ్యమంత్రి కావాలి
కార్యకర్తల అభిప్రాయాల విషయంలో తనకు, పార్టీ చీఫ్ విజయకాంత్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చెంగల్పట్టు జిల్లాలో నిన్న నిర్వహించిన శాసన నియోజకవర్గాల బూత్ కమిటీ నిర్వాహకుల సమావేశానికి హాజరైన ప్రేమలత మాట్లాడుతూ.. కెప్టెన్ విజయకాంత్ ముఖ్యమంత్రి కావాలని, అందుకు కార్యకర్తలు శ్రమించాలని అన్నారు.
ఎవరి పిలుపు కోసమో పార్టీ శ్రేణులు ఎదురుచూడాల్సిన అవసరం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? లేక, ఏదైనా పార్టీతో జట్టుకట్టాలా? అనే విషయాన్ని పార్టీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే, తమిళంలో తనకు రెండు పదాలు నచ్చవని, అందులో ఒకటి క్షమాపణ కాగా, రెండోది కూటమి అంటూ.. పరోక్షంగా ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.