Narendra Modi: ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది: రాజ్యసభలో మోదీ
- కరోనా పోరులో సాధిస్తోన్న విజయం ప్రభుత్వానిది కాదు
- దేశ ప్రజలందరిదీ ఈ విజయం
- భరత్ బలమేంటో ప్రపంచ దేశాలకు తెలిసింది
కరోనా పోరులో సాధిస్తోన్న విజయం ప్రభుత్వానిది కాదని, దేశ ప్రజలందరిదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ రోజు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో కొనసాగుతోందని తెలిపారు.
వైరస్‌పై పోరాటంలో భారత్ ప్రదర్శించిన స్ఫూర్తిని ప్రపంచ దేశాలు గుర్తించి, ప్రశంసించాయని మోదీ చెప్పారు. భరత్ బలమేంటో ప్రపంచ దేశాలకు తెలిసిందని చెప్పుకొచ్చారు. అన్ని ఇబ్బందులను అధిగమించి దేశం ముందుకు సాగుతోందని అన్నారు. వ్యాక్సినేషన్ లో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. అలాగే, కరోనాపై పోరులో అనేక దేశాలకు భారత్ అండగా నిలిచిందని చెప్పారు.
పలు దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్‌ను పంపిస్తోందని తెలిపారు. నూతన అవకాశాలకు నిలయంగా భారత్ మారుతోందని, వాటిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌కు విదేశీ పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. భారత్ నుంచి రెండంకెల వృద్ధిని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయని చెప్పారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. తాము రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు నిలిచిపోయాయని చెప్పారు. సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
రైతుల అభ్యంతరాల పరిశీలనకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉందని మోదీ చెప్పారు. కనీస మద్దతు ధరలో ఎలాంటి మార్పులూ ఉండబోవని చెప్పారు. రైతులకు ఉన్న సమస్యల పరిష్కారానికి చర్చల్లో వారు సూచనలు చేశారని తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు తాము సానుకూలంగా ఉన్నామని చెప్పారు.