Twitter: నిబంధనలు పాటించని ఖాతాలపై వేటు... కేంద్రం నోటీసులపై స్పందించిన ట్విట్టర్
- రైతు నిరసనల నేపథ్యంలో కేంద్రంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
- 1,178 ఖాతాల నుంచి అభ్యంతరకర పోస్టులు
- కేంద్రం ఫిర్యాదుతో చర్యలకు ఉపక్రమించిన ట్విట్టర్
- స్థానిక చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి
రైతు నిరసనల నేపథ్యంలో దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం కన్నెర్ర చేసింది. తప్పుడు ప్రచారం చేస్తూ, విద్వేషాలు రగుల్చుతున్న ఖాతాలపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ కు కేంద్రం ఇటీవల నోటీసులు పంపింది. అసత్య ప్రచారం చేస్తున్న 1,178 ఖాతాలు నిలిపివేయాలని ట్విట్టర్ ను కోరింది. కేంద్రం నోటీసులకు ట్విట్టర్ స్పందించింది.
తమ నిబంధనలు, స్థానిక చట్టాల మేరకు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని పోస్టులను తొలగిస్తామని వెల్లడించింది. స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉండే పోస్టులను తొలగిస్తామని వివరించింది. పోస్టులపై వస్తున్న ఫిర్యాదుల సమాచారాన్ని ఖాతాదారులకు కూడా తెలియజేస్తామని తెలిపింది. పారదర్శకత, ప్రజా సంభాషణ సాధికారతే తమ లక్ష్యమని ట్విట్టర్ ఈ సందర్భంగా ఉద్ఘాటించింది.