India: ఛేజింగ్ లో టీమిండియాకు ఎదురుదెబ్బ... ఆరంభంలోనే రోహిత్ అవుట్
- చెన్నై టెస్టులో భారత్ టార్గెట్ 420 రన్స్
- వికెట్ నష్టానికి 39 పరుగులు చేసిన భారత్
- రోహిత్ ను అవుట్ చేసిన లీచ్
- ముగిసిన నాలుగో రోజు ఆట
- క్రీజులో గిల్, పుజారా
చెన్నై టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. 420 పరుగుల లక్ష్యఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట చివరికి 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బంతికి బౌల్డయ్యాడు. భారత్ గెలవాలంటే ఇంకా 381 పరుగులు అవసరం కాగా, చేతిలో 9 వికెట్లున్నాయి. శుభ్ మాన్ గిల్ (15), ఛటేశ్వర్ పుజారా (12) క్రీజులో ఉన్నారు.
భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్ల సహకారం ఎంతో అవసరం. ఆ లెక్కన చూస్తే రోహిత్ శర్మ ఆరంభంలోనే అవుట్ కావడం భారత్ కు విఘాతమేనని చెప్పాలి. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు సాధించాడు.
ఇక, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో లారెన్స్ వికెట్ తీసిన ఇషాంత్ శర్మ 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన భారత పేసర్లలో కపిల్ దేవ్ (434), జహీర్ ఖాన్ (311)ల తర్వాత ఇషాంత్ మూడో స్థానంలో నిలిచాడు. ఇషాంత్ శర్మ 98 టెస్టుల్లో ఈ ఘనత అందుకున్నాడు.