Jagan: అమరావతి ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డే కీలకం... వీలైనంత త్వరగా పూర్తి చేయాలి: సీఎం జగన్
- ఏఎంఆర్డీయే అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష
- హాజరైన మంత్రి బొత్స, ఉన్నతాధికారులు
- కరకట్ట రోడ్డు 4 లేన్లుగా విస్తరణ
- రూ.150 కోట్ల వ్యయం అంచనాలతో ప్రతిపాదనలు
- సీఎంకు వివరించిన అధికారులు
ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) అభివృద్ధిపై సీఎం జగన్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్నీ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కరకట్ట రోడ్డు ఎంతో కీలకం అని, రోడ్డు విస్తరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరకట్ట రోడ్డును ఆనుకుని ఉన్న రహదారులను కూడా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడంపై సీఎం జగన్ కు వివరాలు తెలిపారు. కరకట్ట రోడ్డు విస్తరణకు రూ.150 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించినట్టు వెల్లడించారు.