Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ను గుజరాత్ ఎప్పటికీ పాలించలేదు: మమతా బెనర్జీ
- కేంద్రంలో క్రూరమైన ప్రభుత్వం ఉందన్న మమత
- తుపానుకు చాలీచాలని సాయం చేశారని ఆగ్రహం
- వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని మమత ధీమా
- భారీ మెజారిటీ వస్తుందని వెల్లడి
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. కేంద్రంలో ఉన్నది ఓ క్రూరమైన ప్రభుత్వం అని అన్నారు. ఎంఫాన్ తుపానుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతే చాలీచాలని సాయం చేశారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ను గుజరాత్ ఎన్నటికీ పాలించలేదంటూ పరోక్షంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షా ఇద్దరూ గుజరాత్ కు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ వారాంతంలో పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ దే విజయం అని, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని మమత ధీమా వ్యక్తం చేశారు. 'కొందరు మేం మరికొన్నిరోజులే అధికారంలో ఉంటామని చెబుతున్నారు. కానీ మేం భారీ మెజారిటీతో మరోసారి అధికారం చేపడతాం' అని స్పష్టం చేశారు. దేశంలో అనేక అంశాలున్నా గానీ బీజేపీ నేతలు అవేమీ పట్టనట్టుగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బెంగాల్ పై పడ్డారని వ్యాఖ్యానించారు. బీజేపీ మంత్రులు, నేతలు పశ్చిమ బెంగాల్ లో తమకు తెలియని ప్రాంతాలకు కూడా వస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.