Work From Home: వర్క్ ఫ్రమ్ హోం ఎఫెక్ట్.. 90 శాతం మందిలో శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి
- ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడి
- 20 శాతం అధిక సమయం పనిచేస్తున్న ఉద్యోగులు
- మెడనొప్పి, తలనొప్పి, నడుము నొప్పులతో బాధపడుతున్న వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులు
కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే సౌలభ్యాన్ని కల్పించాయి. తొలుత ఇదేదో బాగుందని సంబరపడినవారు ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లి పనిచేయడమే బాగు అని భావిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల శారీరక, మానసిక అనారోగ్యాలు చుట్టుముట్టడమే ఇందుకు కారణమని హర్మన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నిచర్ తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది.
ఈ సంస్థ సర్వే ప్రకారం.. ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగులు 20 శాతం ఎక్కువ సమయం కూర్చుని పనిచేస్తున్నారు. ఫలితంగా 90 శాతం మంది నొప్పులు వంటి శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, మానసిక ఒత్తిడి కూడా వారిపై విపరీతంగా పెరుగుతోంది. వీరిలో 39.40 శాతం మందికి మెడనొప్పి, 53.13 శాతం మందికి నడుమునొప్పి, 44.28 శాతం మందికి నిద్రలేమి, 34.53 శాతం మందికి చేతులు, 33.83 శాతం మందికి కాళ్ల నొప్పులు, 27.26 శాతం మందిలో తలనొప్పి, కళ్లు లాగడం వంటి సమస్యలు ఉన్నట్టు సర్వేలో తేలింది.