America: అభిశంసన తీర్మానంపై నేటి నుంచి విచారణ.. ట్రంప్‌కు అండగా రిపబ్లికన్లు
- అభిశంసన రాజ్యాంగబద్ధమేనా? అనే దానిపై తొలుత చర్చ
- కేపిటల్ హిల్‌పై దాడి ఘటనకు ట్రంప్ బాధ్యుడు ఎలా అవుతారంటున్న రిపబ్లికన్లు
- ఇది దేశాన్ని రెండుగా విభజిస్తుందంటున్న ర్యాండ్ పాల్
కేపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి తర్వాత కష్టాలు చవిచూస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై విచారణ నేటి నుంచి మొదలు కానుంది. అయితే, మాజీ అధ్యక్షుడిని అభిశంసించడం రాజ్యాంగబద్ధమేనా? అన్న విషయంపై తొలుత చర్చ జరుగుతుంది. విచారణ జరిగినా ట్రంప్ నిర్దోషిగానే బయటపడతారని రిపబ్లికన్లు అభిప్రాయపడుతున్నారు. కేపిటల్ హిల్‌పై దాడికి ట్రంప్‌ను బాధ్యుడిని ఎలా చేస్తారంటూ రిపబ్లికన్లు ఆయనకు మద్దతు పలుకుతున్నారు.
ఒకవేళ ట్రంప్ ప్రసంగాలపై నేర ముద్ర వేయాలనుకుంటే కనుక చాలామందిని అభిశంసించాల్సి వస్తుందని చెబుతున్నారు. అభిశంసన తీర్మానానికి తాము పూర్తిగా వ్యతిరేకమని రిపబ్లికన్లు కుండబద్దలుగొట్టారు. అభిశంసన రాజ్యాంగ విరుద్ధమని, ఇది దేశాన్ని విభజిస్తుందని రిపబ్లికన్ సెనేటర్ ర్యాండ్ పాల్ పేర్కొన్నారు. అభిశంసన తీర్మానంపై విచారణ చేపట్టాలనుకుంటే తొలుత సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హెచ్చరించిన డెమొక్రటిక్ నేత చక్ షూమర్పై విచారణ చేపట్టాలని ర్యాండ్ పాల్ డిమాండ్ చేశారు.