Rakesh Tikait: చర్చలకు మేం సిద్ధం.. తేదీ, సమయం మీరు చెప్పండి: రైతు సంఘాలు

We are ready to discuss on farm laws says farmer leaders
  • ప్రధాని ‘ఆందోళన జీవి’ వ్యాఖ్యలపై అభ్యంతరం
  • ప్రభుత్వాల తప్పుడు విధానాలను అడ్డుకోవడానికే ఆందోళనలు
  • ఆకలిపై పోరాటం చేస్తామంటే కుదరదన్న రాకేశ్ తికాయత్
ఉద్యమాన్ని విరమించి చర్చలకు రావాలంటూ పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనకు రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఏ రోజు, ఎన్ని గంటలకు మాట్లాడుకుందామో చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు శివకుమార్ కక్కా కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆందోళనలకు ప్రజాస్వామ్యంలో ముఖ్యభూమిక ఉంటుందన్న ఆయన, ప్రధాని చేసిన ‘ఆందోళన జీవి’ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంబిస్తే వ్యతిరేకించడం ప్రజల హక్కు అని అన్నారు. లాంఛనప్రాయమైన ఆహ్వానం పంపితే చర్చలకు వచ్చేందుకు తాము సిద్ధమని మరో రైతు నేత అభిమన్యు కొహార్ అన్నారు.

రైతు ఉద్యమనేత రాకేశ్ తికాయత్ నిన్న ఘజియాబాద్‌లో మాట్లాడుతూ .. ఆకలిపై వ్యాపారం చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. ఆకలి పెరిగితే పంటల ధరలు అందుకు అనుగుణంగా మారుతాయని, ఆకలిపై వ్యాపారం చేయాలనుకునే వారిని ఈ దేశం నుంచి తరిమికొడతామని హెచ్చరించారు.

విమాన టికెట్ ధరలు రోజుకు రెండుమూడుసార్లు మారుతుంటాయని, అలాంటిది పంట ఉత్పత్తుల ధరలను నిర్ణయించలేమని చెప్పడం సరికాదన్నారు. కనీస మద్దతు ధరకు విడిగా చట్టం లేకపోవడం వల్ల వ్యాపారులు తక్కువ ధరకు కొని రైతులను దోచుకుంటున్నారని రాకేశ్ తికాయత్ ఆరోపించారు.
Rakesh Tikait
Farm Laws
Farmers protest
Narendra Modi

More Telugu News