Rakesh Asthara: రాకేశ్ ఆస్థానాకు అన్ని కేసుల నుంచి క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ!
- అభియోగాలపై లభించని సాక్ష్యాలు
- మూడేళ్ల పాటు కొనసాగిన విచారణ
- క్లీన్ చిట్ పై సంతకం చేసిన ఆర్కే శుక్లా
సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు తనపై ఉన్న అన్ని కేసుల నుంచి క్లీన్ చిట్ లభించింది. ఆయనపై ఉన్న అభియోగాలను తొలగించాలని ఏగ్రీవంగా విచారణ జరిపిన అధికారులు నిర్ణయించారని, వారి అభిప్రాయాన్ని సూపర్ వైజింగ్ బృందం కూడా ఆమోదించిందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, స్టెర్లింగ్ బయోటెక్ నుంచి, మాంసం ఎగుమతిదారు మోయిన్ ఖురేషీ నుంచి లంచాలు తీసుకున్నారని రాకేశ్ ఆస్థానాపై ఆరోపణలు రాగా, సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇక గత వారంలో సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి పదవీ విరమణ చేసిన ఆర్కే శుక్లా, రాకేశ్ ఆస్థానా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మిగతావారికి క్లీన్ చిట్ ఇస్తూ సంతకం చేశారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసు 2017, ఆగస్టు 30న రిజిస్టర్ కాగా, ముగ్గురు అధికారులు, స్టెర్లింగ్ బయోటెక్, గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులపై అభియోగాలు నమోదయ్యాయి. స్టెర్లింగ్ బయోటెక్, చేతన్, నితిన్ సందేశార సోదరుల ఇంట్లో ఐటీ దాడులు జరిగిన వేళ లభించిన ఓ డైరీ ఈ కేసులో కీలకంగా మారింది.
దీని ఆధారంగా అప్పటి సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానా సందేశార సోదరుల నుంచి రూ. 4 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ డైరీలో ఆస్థానాకు చెందిన 12 అంకెల బ్యాంకు ఖాతా నెంబర్ ఉందని సీబీఐ వర్గాలు తొలుత పేర్కొన్నా, అటువంటి నంబర్ తో ఏ ఖాతా కూడా లేదని ఆపై తేలింది. మూడు సంవత్సరాల పాటు విచారణ సాగగా, ఆస్థానాకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలూ లభించక పోవడంతో దీన్ని ముగించి, క్లీన్ చిట్ ఇవ్వాలని గత సంవత్సరం చివర్లోనే సీబీఐ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.