E-Watch App: ఏపీ సర్కారు అనుమతి లేకుండా ఈ-వాచ్ యాప్ వాడొద్దన్న హైకోర్టు... వెనక్కి తీసుకుంటామన్న ఎస్ఈసీ!
- ఈ-వాచ్ యాప్ ను తీసుకువచ్చిన ఎస్ఈసీ
- అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ
- హైకోర్టులో పిటిషన్లు
- ఫిబ్రవరి 9 వరకు స్టే ఇచ్చిన కోర్టు
- ఇవాళ మరోసారి విచారణ
- తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా
ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ-వాచ్ యాప్ వాడకం నిలుపుదల చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగింది. ఏపీ సర్కారు అనుమతి లేకుండా ఈ-వాచ్ యాప్ ను వాడొద్దని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. అయితే, ఈ-వాచ్ యాప్ కు బదులుగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ విజిల్ యాప్, లేదా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్ ను వినియోగించుకోవచ్చని ఎస్ఈసీకి హైకోర్టు స్పష్టం చేసింది.
వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఈ-వాచ్ యాప్ రూపకల్పన కోసం సాంఘిక సంక్షేమ శాఖ రూపొందించిన సోర్స్ ను వాడినట్టుగా తేలిందని వెల్లడించారు. ఈ యాప్ ను అభివృద్ధి చేసేందుకు సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి తీసుకున్నారో లేదో తెలియదని అన్నారు. ఇలాంటివే మొత్తం 24 అంశాల్లో సందేహాలు తీర్చాలంటూ ఎస్ఈసీకి లేఖ రాశామని, బదులు వచ్చాక యాప్ సర్టిఫికేషన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తమ యాప్ పై అనేక అభ్యంతరాలు నమోదైన నేపథ్యంలో ఎన్నికల సంఘం పునరాలోచనలో పడింది. ఈ-వాచ్ యాప్ ను వెనక్కి తీసుకోవడానికి తాము సిద్ధమేనని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కు అభ్యంతరాలు తెలిపిందని, దాంతో తమ యాప్ ను ఉపసంహరించుకుంటామని వెల్లడించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ను ఈ నెల 17కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.