Andhra Pradesh: ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.... కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- ఏపీలో నేడు తొలి దశ పంచాయతీ ఎన్నికలు
- ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్
- 81.66 శాతం పోలింగ్
- మరికాసేపట్లో ఫలితాల వెల్లడి
- ఆపై ఉప సర్పంచ్ ఎన్నిక
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మరికాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. తొలి విడతలో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచి విజయనగరం మినహా 12 జిల్లాల్లోని పలు పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 18 రెవెన్యూ డివిజన్లలోని 2,723 పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు చేపట్టారు.
కాగా, పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 81.66 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. కృష్ణా జిల్లా టాప్ లో నిలిచింది. ఈ జిల్లాలో 85.06 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 77.04 శాతం నమోదైందని వివరించారు.
పోలింగ్ సరళిపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పందించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించామని చెప్పారు. తొలి విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఫలితాలు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఉప సర్పంచ్ ఎన్నిక ఇవాళ వీలుకాకపోతే బుధవారం చేపడతామని వెల్లడించారు.