Uttarakhand: 1965 నాటి రేడియోధార్మిక పరికరం కారణంగానే పెను విపత్తు సంభవించిందని భావిస్తున్న రేణీ గ్రామస్థులు!
- ఉత్తరాఖండ్ లో పెను ఉత్పాతం
- మంచు చరియలు విరిగిపడి ఆకస్మిక వరదలు
- వందలమంది గల్లంతు
- రేడియోధార్మిక పరికరంపై గ్రామస్థుల అనుమానం!
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా నది మహోగ్రరూపం దాల్చి దిగువన ఉన్న ప్రాంతాలను అతలాకుతలం చేసిన ఘటనలో వందలమంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి ఆచూకీ లేదు. మెరుపు వరదల కారణంగా ఇక్కడి రేణీ గ్రామం కూడా తీవ్రంగా నష్టపోయింది. కాగా, తపోవన్ ప్రాంతంలో వరద బీభత్సానికి ఓ రేడియో ధార్మిక పరికరమే కారణమని రేణీ గ్రామస్తులు నమ్ముతున్నారు.
1965లో ఇక్కడి నందాదేవి పర్వతశిఖరంపై ఓ రహస్య కార్యక్రమం చేపట్టేందుకు వచ్చిన సీఐఏ, ఐబీ బృందాలు అణుశక్తితో పనిచేసే నిఘా వ్యవస్థల ఏర్పాటుకు ప్రయత్నించాయి. భారత్ లో కాంచన్ జంగా తర్వాత ఎత్తయిన పర్వతం నందాదేవి మాత్రమే. దాంతో చైనాపై నిఘా వేసేందుకు ఈ పర్వతశిఖరంపై ఆ రేడియోధార్మిక పరికరాన్ని అమర్చాలన్నది నాడు సీఐఏ-ఐబీ ఆలోచన!
అయితే ఆ సంయుక్త బృందానికి అప్పట్లో వాతావరణం సహకరించలేదు. మంచు తుపాను ధాటికి వారు వెనుదిరిగారు. ఆ రేడియోధార్మిక పరికరాన్ని ఆ పర్వతం బేస్ క్యాంపు వద్దే వదిలేశారు. ఏడాది తర్వాత ఆ బృందం తిరిగి నందాదేవి పర్వతం వద్దకు రాగా, ఆ పరికరం కనిపించలేదు. అటుపై ఎన్నిసార్లు అన్వేషించినా ఆ పరికరం జాడ మాత్రం గుర్తించలేకపోయారు. ఈ పరికరం జీవనకాలం 100 ఏళ్లు. అది ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఓ చోట ఉండి ఉంటుందని, దాని ప్రభావంతోనే మంచుకొండల్లో విలయం ఏర్పడిందని రేణీ గ్రామస్థులు నమ్ముతున్నారు.
ధౌలిగంగా నదిలో బురదతో పాటు రాళ్లు వచ్చాయని, పైగా ఓ కొత్త వాసన వచ్చిందని, ఆ ఘాటుకు తాము కొంతసేపటి వరకు ఊపిరి పీల్చుకోలేకపోయామని గ్రామస్థులు చెబుతున్నారు. అది కేవలం మంచు, ఇతర శకలాలే అయితే అటువంటి వాసన రాదని వారు స్పష్టం చేశారు. తమ పూర్వీకులు కూడా ఆ పరికరం గురించి చెప్పేవారని, వారి భయాలు ఇప్పుడు నిజమయ్యాయని దేవేశ్వరి దేవి అనే స్థానికురాలు వెల్లడించారు.