Anantapur District: మద్దతుదారులకు వంట చేసి పెట్టిన దళిత అభ్యర్థి.. వంటలో పేడ, బొగ్గులు వేసిన ఎస్సై!
- అనంతపురం జిల్లా గంగవరంలో ఘటన
- వంటకు అనుమతి ఎవరు ఇచ్చారంటూ ఎస్సై వీరంగం
- విచారణ చేపట్టిన సీఐ
ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగిన ఓ దళిత అభ్యర్థి తన మద్దతుదారులకు వంట చేసి పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఓ ఎస్సై వండిన ఆహారంలో పేడ, బొగ్గులు వేసిన ఘటన అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని గంగవరంలో నిన్న జరిగింది.
ఎస్సీ వర్గానికి చెందిన లక్ష్మీదేవి పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగింది. ప్రచారం కోసం తన వెంట తిరిగిన వారికి భోజనం వండిస్తుండగా అక్కడికి చేరుకున్న ఎస్సై హరూన్‌బాషా.. వంటకు అనుమతి ఎవరు ఇచ్చారంటూ రెచ్చిపోయాడు. కులం పేరుతో ఆమెను దూషించడమే కాకుండా, ఆ వంటను ఎవరూ తినకూడదంటూ అందులో పేడ, బొగ్గులు వేసినట్టు బాధితులు ఆరోపించారు.
అంతేకాదు, పొయ్యిలు ఆర్పేసి ఆమె మద్దతుదారులను అక్కడి నుంచి తరిమికొట్టాడు. బాధితుల ఫిర్యాదుతో కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివశంకర్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై ఎస్పీకి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎస్సై హరూన్ బాషా మాట్లాడుతూ.. తాను పొయ్యిని మాత్రమే ఆపానని, అక్కడున్న వారిని చెదరగొట్టానని వివరణ ఇచ్చాడు.