KCR: హాలియాలో నేడు కేసీఆర్ బహిరంగ సభ.. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం!
- మరికాసేపట్లో సాగర్‌కు కేసీఆర్
- శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంచే వ్యూహం
- నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
- రెండు గంటలకు బహిరంగ సభ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక శంఖారావాన్ని పూరించనున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో అప్రమత్తమైన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నారు. నోముల నర్సింహయ్య మరణంతో సాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. నాగార్జునసాగర్‌పైనా కన్నేసింది.
మరికాసేపట్లో హెలికాప్టర్‌లో సాగర్ బయలుదేరనున్న కేసీఆర్ తొలుత సాగర్ చేరుకుని అక్కడి డ్యామ్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు హాలియాలో బహిరంగ సభలో మాట్లాడతారు. మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లు చేయించగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కార్యకర్తలు, రైతులను పెద్ద ఎత్తున ఈ సభ కోసం సమీకరిస్తున్నారు.