Telangana: ఒక్కసారిగా పెరిగిన చలి.. ఉత్తరాఖండ్ ఉపద్రవం ప్రభావమేనా?
- మూడు రోజుల నుంచి తెలంగాణను వణికిస్తున్న చలి
- ఎల్లుండి వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ
- ఉత్తరాఖండ్ విలయం ప్రభావంపై అధ్యయనం
గత మూడు, నాలుగు రోజులుగా తెలంగాణ చలిపులి విజృంభిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ చలి మరింత భయపెడుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు పడిపోవడంతోపాటు శీతల గాలుల కారణంగా ప్రజలు వణుకుతున్నారు. ఎల్లుండి (12వ తేదీ) వరకు రాష్ట్రంలో చలి తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణశాఖ రాష్ట్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. హిమాలయాల నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా తెలంగాణ వైపు శీతల గాలులు వస్తున్నట్టు చెప్పారు.
చలి ఒక్కసారిగా పెరగడానికి, ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ఉందా? అన్న కోణంలో అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. నిజానికి గత నెలలోనే చలి దాదాపు తగ్గిపోయింది. మధ్యాహ్నం వేళ ఎండ వేడిమి కూడా పెరిగింది. దీంతో ఈ నెలలో అసలు చలి ఉండకపోవచ్చని భావించారు. అయితే, గత మూడు, నాలుగు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చలి తీవ్రత పెరిగింది.