Vijay Sai Reddy: కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిందే: 'విశాఖ ఉక్కు'పై విజయసాయిరెడ్డి
- రాజకీయాలకు అతీతంగా పోరాడదాం
- విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కని మొదటి నుంచీ చెబుతున్నాం
- దాన్ని ప్రైవేటుపరం చేయకుండా చూసుకోవాలి
- వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రయత్నాలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. కర్మాగారం సమీపంలో కార్మికులు ఈ రోజు బహిరంగ సభ నిర్వహించారు. దీనికి వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి, వామపక్ష నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిందేనని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాడదామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మనం మొదటి నుంచీ చెబుతున్నామని విజయసాయిరెడ్డి అన్నారు. దాన్ని ప్రైవేటుపరం చేయకుండా చూసుకోవాలని చెప్పారు. ఐదు దశాబ్దాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మహోజ్వల పోరాటానికి విశాఖ ఉక్కు ఉద్యమం స్ఫూర్తిని ఇచ్చిందని, దాన్ని పోరాడి సాధించుకున్నామని తెలిపారు.
వేలాది మందికి ఆ కర్మాగారం ఉద్యోగాలు కల్పిస్తోందని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్మికులు చేస్తోన్న ఉద్యమానికి తాము మద్దతు తెలుపుతామని చెప్పారు. ఏ పరిస్థితులు వచ్చినా ఆ సంస్థను ప్రైవేటు పరం కానివ్వకూడదని వ్యాఖ్యానించారు.