USA: ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడాన్ని స్వాగతిస్తున్నాం: అమెరికా
- ఇండో పసిఫిక్ లో భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని ప్రకటన
- స్నేహితులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
- చైనా ఆక్రమణల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశ విదేశాంగ శాఖ
- శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచన
- సాగు చట్టాల రద్దుపైనా స్పందన
ఇండో–పసిఫిక్ లో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అమెరికా ప్రకటించింది. ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడాన్ని స్వాగతిస్తున్నామంటూ బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. ఇండో పసిఫిక్ భద్రతలో భారత్ ది చాలా కీలకమైన పాత్ర అని తెలిపింది.
‘‘భారత్–అమెరికాలది అత్యంత విశాలమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం. అన్ని విధాలా రెండు దేశాల మధ్య సహకారం, బంధం మరింత బలపడేందుకు కృషి చేస్తాం. ఈ బలమైన బంధం మున్ముందూ కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు.
స్నేహితులు, భాగస్వాములకు తామెప్పుడూ అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. భారత్ సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరును చాలా నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. వివాదాల పరిష్కారానికి ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయని, శాంతియుత ధోరణిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అయితే, పొరుగు దేశాలను బెదిరించి భయపెడుతూ ఆక్రమణలకు తెగబడుతున్న చైనా తీరు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క భారత్ కే కాకుండా మిత్రులందరికీ అండగా ఉంటామన్నారు.
సాగు చట్టాల రద్దు డిమాండ్ తో రైతులు చేస్తున్న ఆందోళనలపై అడిగిన ప్రశ్నకూ ఆయన బదులిచ్చారు. భారత ప్రభుత్వంతో తాము మాట్లాడుతూనే ఉన్నామన్నారు. అత్యున్నత ప్రజాస్వామ్య విలువలున్న భారత్ లాంటి దేశం.. ఆ విలువలను కాపాడుతుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, అంతర్జాతీయ భద్రతా మండలిలో భారత్ కు చోటు దక్కడంపై ప్రైస్ హర్షం వ్యక్తం చేశారు.
వాణిజ్య పరంగానూ భారత్ తో మంచి సంబంధాలున్నాయని ప్రైస్ గుర్తు చేశారు. 2019లో భారత్–అమెరికాల మధ్య వాణిజ్య విలువ 14,600 కోట్ల డాలర్లకు పెరిగిందన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ మాట్లాడారని ప్రైస్ చెప్పారు. మయన్మార్ లో సైనిక పాలన కూడా ప్రస్తావన వచ్చిందన్నారు. కొవిడ్, పర్యావరణ మార్పులపైనా చర్చించారని వెల్లడించారు.