KA Paul: స్టీల్ ప్లాంట్ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్
- ప్రైవేట్ పరం కానున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్
- కేంద్ర నిర్ణయంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోతారన్న పాల్
- ప్రైవేటు పరం చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని పాల్ పిటిషన్
ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో ఆయన సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరించాలనే నిర్ణయం బాధాకరమని చెప్పారు. డిజిన్వెస్ట్ మెంట్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరామని చెప్పారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కలసిరావాలని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.