Botsa Satyanarayana: చెప్పుడు మాటలు విని పక్కదారి పట్టొద్దు: వలంటీర్లకు బొత్స హితవు
- పంచాయతీ ఎన్నికల్లో 82 శాతానికి పైగా గెలుపొందాం
- చంద్రబాబు అంకెల గారిడీ చేస్తున్నారు
- కింద పడినా, పైనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు
వలంటీర్లు అంటే సేవా దృక్పథంతో పని చేసే వారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వారికి రూ. 5 వేల గౌరవ వేతనం ఇస్తామని ముందే చెప్పామని అన్నారు. ప్రతి ఇంటికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. వలంటీర్లకు ఎంతో గౌరవం ఉందని... ఎవరో చెప్పే మాటలు విని, పక్కదారి పట్టొద్దని హితవు పలికారు.
ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 82 శాతానికి పైగా వైసీపీ మద్దతుదారులు గెలుపొందారని అన్నారు. 2,637 పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలుపొందారని చెప్పారు. తమ మద్దతుదారులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలేనని బొత్స మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు చెప్పింది అంకెల గారడీనే అని చెప్పారు. కింద పడినా, పైనే ఉన్నట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.