Vijayashanti: కేసీఆర్ ప్రసంగానికి సభకు హాజరైన ప్రజలు స్పందించలేదు: విజయశాంతి
- కేసీఆర్ మరోమారు ఎన్నికల ప్రసంగాలను మొదలు పెట్టారు
- జీహెచ్ఎంసీ తర్వాత మళ్లీ ప్రజలను కలవక తప్పదని అనుకున్నట్టుంది
- వరంగల్ ను కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తొక్కిపడేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రిగారు మరోమారు ఎన్నికల ప్రసంగాలను మొదలు పెట్టారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని... ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక దృష్ట్యా అలా అనుకున్నట్టుందని చెప్పారు.
మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం... మాట తప్పితే మెడ నరుక్కుంటా... అన్నవన్నీ నిజమే అయితే, టీఆర్ఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదని విజయశాంతి అన్నారు. ఇక కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ గారు చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనం ఉంటదో... పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు.
మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం గారి ప్రసంగానికి స్పందించక పోవటాన్ని చూస్తేనే అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.