Twitter: అక్కడ ఒకలా.. ఇక్కడ మరోలా: ట్విట్టర్​, ఫేస్​ బుక్​ వంటి సోషల్​ మీడియాలపై కేంద్రం మండిపాటు

Action will be taken if Twitter FB platforms are misused warns Govt
  • క్యాపిటల్ హిల్ పై దాడిని ఒకలా చూపించి.. ఎర్రకోటపై దాడిని మరోలా చూపించారన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
  • భారత్ లో వ్యాపారం చేయాలంటే ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని స్పష్టీకరణ
  • తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • ఫేక్ న్యూస్ కు అడ్డుకట్ట వేయడానికి వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడి
ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు కచ్చితంగా భారత నిబంధనలు పాటించి తీరాల్సిందేనని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. తప్పుడు వార్తలు, ద్వేషపూరిత ప్రచారాలు చేస్తే సహించబోమని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ‘‘అది ట్విట్టర్ అయినా.. ఫేస్ బుక్ అయినా.. లింక్డ్ ఇన్ అయినా.. వాట్సాప్ అయినా.. భారత్ లో వ్యాపారం చేసుకోవచ్చు. వారికి ఇక్కడ కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఆయా సంస్థలు కచ్చితంగా భారత రాజ్యాంగం, చట్టాలకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

కొన్ని సోషల్ మీడియా సంస్థలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అమెరికా చట్ట సభ క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి ఘటనను ఒకలా, ఇక్కడ ఎర్రకోటపై జరిగిన దాడిని మరోలా చూపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఫేక్ న్యూస్ కు అడ్డుకట్ట వేయడం కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు.
Twitter
Facebook
Red Fort
Capitol Hill
Ravishankar Prasad

More Telugu News